Friday, April 30, 2010

Ole Miss Student Union Jai Ho Break-out

Here is a video of bunch of students at Ole Miss breaking out to Jai Ho song from the movie "Slum Dog Millionaire". Obviously this video is staged, but it still is pretty cool.

Sunday, June 15, 2008

హేపీ ఫాదర్స్ డే (నాకు, మీక్కూడా)

నా బ్లాగు చూస్తున్న తండ్రులందరికీ నా హృదయపూర్వక ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మీ పిల్లలు మీకు నచ్చినవి ఇచ్చి, మీరు మెచ్చినవి చేసి ఉంటారని అనుకొంటున్నా. కొంతమందికి ఈ ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు గట్రా నచ్చవు. వీటిని కేవలం గ్రీటింగ్ కార్డ్ కంపెనీల వాళ్ళు పుట్టించినవే తప్ప, వీటికి మరే విధమైన ఇంపార్టెన్స్ లేదని వాదిస్తూ ఉంటారు. వారి వాదనలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు కానీ, ఒక తండ్రిగా నాకు ఈ ఫాదర్స్ డే బాగా నచ్చుతుంది.

మా పిల్లలు (వాళ్ళ అమ్మ సహాయంతోనే అనుకోండీ) నాన్నకు ఏమి కొనిద్దామా అని తెగ ఆలోచించి, కడకు ఏదో ఒకటి వాళ్ళమ్మతో కొనిపిస్తారు. కొన్నది నా డబ్బుతోనే అయినప్పటికీ, మా పిల్లలు నా గురించే ఆలోచిస్తూ, నా అభిప్రాయలకు విలువ ఇస్తూ నా కోసం షాపింగ్ చేయడం అనేది నాకు చాల ఆనందంగా అనిపిస్తుంది. ఆ తరువాత, వాళ్ళ సొంత ఆలోచనలతో ఒక గ్రీటింగ్ కార్డ్ చేస్తారు. వాళ్ళు గీసేవి పిచ్చి గీతలే అయినా, అవి నాకోసం గీసినవి గనుక, నాకు పికాసో చిత్రాలవంటివే.

మొన్నామధ్య నేను ఏదో పనిలో ఉన్నప్పుడు, మా పెద్దవాడు నా పక్కన కూర్చుని ట్రాన్స్ ఫార్మర్స్ మూవీలో కేరక్టర్స్ గురించీ, పోకీమాన్ల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. అవి వాడికి చాల ఇష్టమైన టాపిక్స్, ఎంతసేపైనా అలా చెప్పుకుంటూ పోతాడు. నేను పని మధ్యలో ఉండడం వల్ల, వాడి కబుర్లు వినే సమయం లేక, వాడికి ఒక డ్రాయింగ్ ఎసైన్ మెంట్ ఇచ్చా. ఏదైనా ఒక బొమ్మ గియ్యరా అంటే, ఐదు నిమిషాలలో వాడికిష్టమైన పోకీమాన్ బొమ్మ ఒకటి గీసేసి నా చేతిలో పెట్టేస్తాడని నాకు బాగా తెలుసు గనుక, కొంచెం ఆలోచించి, వాడికి నా మైండులో ఉన్న ఒక సీనరీ గురించి చెప్పి అది గీసుకొని రమ్మన్నా. నాన్న నన్ను వదిలించుకోవడానికి పెద్ద ప్లాన్ వేశాడని వాడికి అర్ధమైపోయినట్టుంది, ఏదో వినీ విననట్టుగా బుర్ర ఊపేసి వెళ్ళిపోయాడు. ఓ రెండు నిమిషాల తరువాత, తండ్రి మాట జవదాటని శ్రీరాముడిలా, వాడికి తోచినట్టు ఏదో గీసేసి నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. నన్ను ఆరోజుకి ఇక డిస్టర్బ్ చెయ్యలేదు. మళ్ళీ ఇంకో ఎసైన్ మెంట్ ఇస్తాననుకున్నాడేమో అనుకొని నవ్వుకుంటూ నాపనిలో పడిపోయా. తరువాత నేను ఆసంగతి పూర్తిగా మర్చి పోయా.

ఈరోజు (ఫాదర్స్ డే) ప్రొద్దున్నే, మాపిల్లలు ప్రతీ సంవత్సరంలానే, ఫాదర్స్ డే గ్రీటింగ్ కార్డులు నా చేతిలో పెట్టారు. మాచిన్నోడు గీసిన బొమ్మలు చూస్తూ వాడి ఎక్స్ ప్లనేషన్స్ విని అందరం నవ్వుకున్నాం. తరువాత మా పెద్దోడి కార్డు తెరిచి చూసా. మామూలుగా ఎప్పుడూ ఎదో పోకీమాన్ బొమ్మో, ఎదో ఒక వింత వాహనమో గీస్తూ ఉంటాడు. ఈసారి ఆ కార్డు మీద, వాడికి ఇష్టమైన పోకీమాన్ బొమ్మా లేదు, వాడికిష్టమైన వింత కారూ లేదు. వాటికి బదులుగా, ఒక పెద్ద పచ్చగడ్డితో నిండిన మైదానం, దాని మధ్యలో ఒంటరిగా ఒక చిన్న మొక్క, ఒకేఒక్క పువ్వుతో. వాలీ వాలనట్టుగా ఆ పువ్వుతో ఆటలాడుతున్న ఒక సీతాకోక చిలుక. అది సరిగ్గా నేను మొన్నామధ్య వాడికి నామనసులో ఉన్న సీనరీని చెప్పి గీయమన్న బొమ్మ, చాలా శ్రద్దగా గీసి ఉంది. అది చూడగానే నా మనసు పొంగి పోయిందనుకోండి. తన ఇష్టాఇష్టాలకు కొడుకు విలువ ఇవ్వడం కన్నా మించింది ఏముంటుంది ఏ తండ్రి కైనా.

మర్చిపోకుండా మీరు కూడా మీనాన్న గారికి ఈ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. ఎక్కడో ఇండియాలో ఉన్న ఆ ముసలాయనికి ఫాదర్స్ డే అంటే ఏమర్ధమవుతుందీ అనుకుంటున్నారేమో, అదే అవకాశంగా తీసుకొని ఇంకో పది నిమిషాలు ఎక్కువ మాట్లాడితే, ఆయనకన్నా సంతోషించే వారుండరు.

"ఒరే, ఈరోజు పాదర్ డే అంట, పొద్దున్నే మావోడు పోన్ జేసి చెప్పేడు. అమెరికాలో ఇట్టా సవచ్చరానికో పాలి వాళ్ళ నాన్నల రోజు అని చేసుకుంటారంట, తెలుసా?" అని ఆయన అందరికీ చెప్పి సంతోషపడతారు.

Thursday, June 12, 2008

నీళ్లు వేస్ట్ చెయ్యకండ్రా బాబూ!

ఎవరైనా మరీ ఎక్కువగా ఖర్చు పెడుతుంటే, "మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తున్నాడు" అనడం మనకి అలవాటే. ఇక ముందు ముందు అలా కంపేర్ చెయ్యాల్సి వచ్చినప్పుడు, మనం వేరే క్రొత్త నానుడి వెతుక్కోవాల్సి వచ్చేలా వుంది. అమెరికా లాంటి సంపన్న దేశాలలో తప్ప, ప్రపంచంలో చాలా దేశాలలో మంచినీటి కొరత నానాటికీ ఎక్కువయిపోతుంది. రోజు రోజుకీ బావులు ఎండి పోతున్నాయి. ఎంతో లోతుకి తవ్వితే తప్ప మంచి నీరు పడడం లేదు. అందుకే, ప్రతీవారూ తమ సాయశక్తులా నీళ్లు పొదుపుగా వాడడటానికి ప్రయత్నించాలి.

UNICEF వారి లెక్కల ప్రకారం, అమెరికాలో మనం ప్రొద్దున్నే లేచి, రెడీ అయ్యి, ఆఫీసు చేరే సరికి ఒక్కొక్కరం సుమారుగా 100 గేలన్ల నీటిని వాడుతామంట. మీకు తెలుసా, ప్రపంచంలో చాలా మంది రోజు మొత్తానికి కేవలం 2 గేలన్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని? ఇంకా వివరాలకు, ఈ లింకు చూడండి. (ఇదే విషయం ఎప్పుడూ స్నానం ఎలా ఎగ్గొడదామా అని చూసే పిల్లలికి చెపితే, "మేము ఇకనుండి వారానికి ఒక్కసారే స్నానం చేస్తామని" అంటారేమో, జాగ్రత్త, సుమా!).

నీరు పొదుపు చెయ్యడానికి కొన్ని సలహాలు:

  • నీరు పొదుపు చెయ్యడానికి స్నానం మానెయ్యమని కాదు. వీలయినంత తక్కువ నీరు వాడి, త్వరగా (5 నిమిషాలలోపు) స్నానం ముగించాలి. ఇంకో 10 నిమిషాలు ఎక్కువసేపు తోమినంత మాత్రాన మీ వళ్ళు ఏమీ ఎక్కువ తళతళలాడదని గుర్తుంచుకొండి. ఇక్కడ "ఎలుక తోక తెచ్చి యేడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు" అనే వేమన గారి పద్యం ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
  • సబ్బుతో వళ్ళు తొముకొనేటప్పుడు, షవర్ కట్టేస్తే బోల్డన్ని నీళ్ళు పొదుపు చేసినట్లే. ఎన్ని నీళ్ళు పొదుపు అవుతాయి అనేది, మీ ఆకారం రమణా రెడ్డిలా ఉంటుందా, లేక సూరేకాంతం లా ఉంటుందా అనే దాని మీద ఆధార పడుతుందనుకోండీ.
  • అలాగే పళ్ళు తోముకుంటున్నంతసేపూ & గడ్డం చేసుకుంటున్నంత సేపూ కుళాయి ఆన్ చేసి ఉంచడం మరికొంత మందికి అలవాటు. ఆ అలవాటుకూడా మార్చుకోవడం చాలా అవసరం.
  • మా ప్రక్కింటివాడు ప్రతీ రోజూ సాయంత్రం 4 గంటలకి లాన్ స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తాడు. ఆ సమయానికి భూమి చాలావేడిగా ఉండడం వల్ల, చాలా నీరు గడ్డివేళ్ళకి చేరక ముందే ఆవిరి అయిపోతుంటుంది. అలా కాకుండా, స్ప్రింక్లర్స్ ఏ తెల్లవారుజామునో ఆన్ అయ్యేలా ప్రోగ్రాం చేసుకుంటే, నీరు ఆవిరై పోకుండా ఉండడమే కాకుండా, గడ్డికీ నీళ్ళు బాగా అందుతాయి. అంతేకాక రోజూ నీరు పెట్టాల్సిన అవసరం లేకుండా వారానికి రెండు మూడు సార్లు పెడితే సరి పోతుంది.
  • గిన్నెలు తోముతున్ననంతసేపూ, కుళాయిని కట్టి ఉంచి, వాటిని కడిగేటప్పుడు మాత్రమే ఆన్ చెయ్యడం కూడా మంచి అలవాటే.
  • నాలుగైదు గిన్నెలే ఉన్నప్పుడు, డిష్‌వాషర్ వాడకుండా, మీరే తోముకుంటే నీళ్ళూ ఆదా అవుతాయి, శారీరకశ్రమవల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ, ముఖ్యంగా మగవారికి, ఓ గమనిక: ఈ విషయం మీ భార్యకు మీరే స్వయంగా చెపితే, మీ తల బొప్పికట్టడమే కాకుండా, ఇకనుండి జిమ్ము‌కి బదులుగా మీరే గిన్నెలు కడగవలసి రావొచ్చు కూడా. జాగ్రత్త!
  • అలాగే మాసిన బట్టలు ఇష్టం వచ్చినప్పుడు కాకుండా, ఒక ఫుల్ లోడ్ కు సరిపడా అయ్యేంతవరకూ ఆగి, వాషింగ్ మెషీన్ ని వాడాలి.
  • మీ ఇంట్లో కుళాయిలు, కమోడ్, షవర్ మొదలైనవి ఏవైనా లీక్ అవుతున్నాయేమో చూసుకొని వెంటనే బాగు చేసుకోవాలి. కారేది ఒకో చుక్కే అయినా, రోజు మొత్తంలో చాలానే అవుతుంది.

ఇలాగే ఇంటా బయటా నీళ్ళు ఎలా పొదుపు చెయ్యొచ్చో తెలియజెయ్యడానికి మా డేల్లస్ వారి వెబ్ సైటు చూడండి http://www.savedallaswater.com/htcw.htm

Tuesday, June 3, 2008

అంతులేని కథ

ఈమధ్య ouch My Toe! బ్లాగులో చదివిన ఒక జోకు తెలుగులో మీకోసం:

బాస్ తన సెక్రెటరీ తో: "కమలా, మన క్లయింట్స్‌ని కలవడానికి ఒక వారం రోజుల పాటు అమెరికాకు వెంటనే వెళ్ళాలి. మనిద్దరికి వెంటనే ఏర్పాట్లు చెయ్యి."

కమల ఫోన్‌లో తన భర్త తో: "రమేష్, వచ్చేవారం నేను మా బాస్ తో కలసి అమెరికా వెళ్ళాలి పని మీద. పాపం నేవచ్చేదాక నువ్వొక్కడివే ఉండాలి."

రమేష్ తన ప్రియురాలి తో: "రాధా, మా ఆవిడ వచ్చేవారం వూళ్ళో ఉండట్లేదు. మనిద్దరం కలిసి ఫుల్ల్‌గా ఎంజాయ్ చేద్దాం, ఇక్కడికి వచ్చేసెయ్."

రాధ తన దగ్గరకు ట్యూషన్‌కి వచ్చే బాబుతో: "సీనూ, వచ్చే వారం నాకు వేరే పని ఉంది, కాబట్టి ట్యూషన్ ఉండదు."

సీను తన తాతగారితో: "తాతా, మాకు వచ్చేవారం ట్యూషన్ లేదు, మనిద్దరం కలిసి రోజూ షికార్‌కి వెల్దాం."

తాత (మన బాసు) గారు సెక్రెటరీ తో: "కమలా, వచ్చేవారం నేనూ, నా మనవడూ కలిసి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాం, మీటింగ్ కేన్సిల్."

కమల ఫోన్‌లో తన భర్త తో: "ఏవండోయ్ గుడ్ న్యూస్, మా బాస్‌కి వేరే పని ఉండడం వల్ల ట్రిప్ కేన్సిల్ అయ్యింది."

రమేష్ తన ప్రియురాలి తో: "సారీ రాధా, మా ఆవిడ వెళ్ళాల్సిన మీటింగ్ కేన్సిల్ అయ్యిందట. మనం కలవడానికి కుదరదు."

రాధ తన దగ్గరకు ట్యూషన్‌కి వచ్చే బాబు తో: "సీనూ, నేను వెళ్ళాల్సిన పని కేన్సిల్ అయ్యింది, కాబట్టి వచ్చేవారం ట్యూషన్ ఉంటుంది."

సీను తన తాతగారితో: "తాతా, మాకు వచ్చేవారం ట్యూషన్ ఉంటుందట, మనం ఇంకోసారెప్పుడయినా షికార్‌కి వెల్దాం."

తాత (మన బాసు) గారు సెక్రెటరీ తో: "కమలా, మీటింగ్ కేన్సిల్ చెయ్యకు, వెంటనే ట్రిప్‌కి కావలసిన ఏర్పాట్లు చెయ్యి."

ఆ విధంగా ఈ కథ నడుస్తూనే ఉంటుంది...

Wednesday, May 21, 2008

భూగోళం ఆన్ సేల్

ప్రతీ వారం ఏదో ఒక పేరున సేల్ పెట్టి జనాలతో వాళ్ళకి అవసరం ఉన్నా లేక పోయినా అడ్డమైన చెత్తా కొనిపించెయ్యడం షాపుల వాళ్ళకి బాగా అలవాటయిపోయింది. ఫలానా షాపులో 20% off Sale అని పేపర్లో కనపడగానే, పరుగెట్టుకెళ్ళి కొనుక్కొచ్చెయ్యడం నాకూ అలవాటే.
మొన్నొకాయన పంపిస్తే "స్టోరీ ఆఫ్ స్టఫ్" అనే వెబ్ సైటు చూసాను. http://www.storyofstuff.com/ ఈ వెబ్ సైట్ చూసాక, నా కళ్ళు తెరుచుకున్నాయంటే నమ్మండి. నిజంగానే ఈ కంపనీ ల వాళ్ళు మన భూగోళాన్ని సేల్ పెట్టి మరీ డిస్కౌంట్ లో అమ్మేస్తున్నారనిపించింది. ఇకనుండి బాగా అవసరం ఉంటే తప్ప ఏ వస్తువూ కొనగూడదని డిసైడ్ అయిపోయా.
మీరు కూడా ఒకసారి ఆ వెబ్ సైటు చూసి మీ అభిప్రాయం తెలియ చెయ్యండి.