నా బ్లాగు చూస్తున్న తండ్రులందరికీ నా హృదయపూర్వక ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మీ పిల్లలు మీకు నచ్చినవి ఇచ్చి, మీరు మెచ్చినవి చేసి ఉంటారని అనుకొంటున్నా. కొంతమందికి ఈ ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు గట్రా నచ్చవు. వీటిని కేవలం గ్రీటింగ్ కార్డ్ కంపెనీల వాళ్ళు పుట్టించినవే తప్ప, వీటికి మరే విధమైన ఇంపార్టెన్స్ లేదని వాదిస్తూ ఉంటారు. వారి వాదనలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు కానీ, ఒక తండ్రిగా నాకు ఈ ఫాదర్స్ డే బాగా నచ్చుతుంది.
మా పిల్లలు (వాళ్ళ అమ్మ సహాయంతోనే అనుకోండీ) నాన్నకు ఏమి కొనిద్దామా అని తెగ ఆలోచించి, కడకు ఏదో ఒకటి వాళ్ళమ్మతో కొనిపిస్తారు. కొన్నది నా డబ్బుతోనే అయినప్పటికీ, మా పిల్లలు నా గురించే ఆలోచిస్తూ, నా అభిప్రాయలకు విలువ ఇస్తూ నా కోసం షాపింగ్ చేయడం అనేది నాకు చాల ఆనందంగా అనిపిస్తుంది. ఆ తరువాత, వాళ్ళ సొంత ఆలోచనలతో ఒక గ్రీటింగ్ కార్డ్ చేస్తారు. వాళ్ళు గీసేవి పిచ్చి గీతలే అయినా, అవి నాకోసం గీసినవి గనుక, నాకు పికాసో చిత్రాలవంటివే.
మొన్నామధ్య నేను ఏదో పనిలో ఉన్నప్పుడు, మా పెద్దవాడు నా పక్కన కూర్చుని ట్రాన్స్ ఫార్మర్స్ మూవీలో కేరక్టర్స్ గురించీ, పోకీమాన్ల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. అవి వాడికి చాల ఇష్టమైన టాపిక్స్, ఎంతసేపైనా అలా చెప్పుకుంటూ పోతాడు. నేను పని మధ్యలో ఉండడం వల్ల, వాడి కబుర్లు వినే సమయం లేక, వాడికి ఒక డ్రాయింగ్ ఎసైన్ మెంట్ ఇచ్చా. ఏదైనా ఒక బొమ్మ గియ్యరా అంటే, ఐదు నిమిషాలలో వాడికిష్టమైన పోకీమాన్ బొమ్మ ఒకటి గీసేసి నా చేతిలో పెట్టేస్తాడని నాకు బాగా తెలుసు గనుక, కొంచెం ఆలోచించి, వాడికి నా మైండులో ఉన్న ఒక సీనరీ గురించి చెప్పి అది గీసుకొని రమ్మన్నా. నాన్న నన్ను వదిలించుకోవడానికి పెద్ద ప్లాన్ వేశాడని వాడికి అర్ధమైపోయినట్టుంది, ఏదో వినీ విననట్టుగా బుర్ర ఊపేసి వెళ్ళిపోయాడు. ఓ రెండు నిమిషాల తరువాత, తండ్రి మాట జవదాటని శ్రీరాముడిలా, వాడికి తోచినట్టు ఏదో గీసేసి నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. నన్ను ఆరోజుకి ఇక డిస్టర్బ్ చెయ్యలేదు. మళ్ళీ ఇంకో ఎసైన్ మెంట్ ఇస్తాననుకున్నాడేమో అనుకొని నవ్వుకుంటూ నాపనిలో పడిపోయా. తరువాత నేను ఆసంగతి పూర్తిగా మర్చి పోయా.
ఈరోజు (ఫాదర్స్ డే) ప్రొద్దున్నే, మాపిల్లలు ప్రతీ సంవత్సరంలానే, ఫాదర్స్ డే గ్రీటింగ్ కార్డులు నా చేతిలో పెట్టారు. మాచిన్నోడు గీసిన బొమ్మలు చూస్తూ వాడి ఎక్స్ ప్లనేషన్స్ విని అందరం నవ్వుకున్నాం. తరువాత మా పెద్దోడి కార్డు తెరిచి చూసా. మామూలుగా ఎప్పుడూ ఎదో పోకీమాన్ బొమ్మో, ఎదో ఒక వింత వాహనమో గీస్తూ ఉంటాడు. ఈసారి ఆ కార్డు మీద, వాడికి ఇష్టమైన పోకీమాన్ బొమ్మా లేదు, వాడికిష్టమైన వింత కారూ లేదు. వాటికి బదులుగా, ఒక పెద్ద పచ్చగడ్డితో నిండిన మైదానం, దాని మధ్యలో ఒంటరిగా ఒక చిన్న మొక్క, ఒకేఒక్క పువ్వుతో. వాలీ వాలనట్టుగా ఆ పువ్వుతో ఆటలాడుతున్న ఒక సీతాకోక చిలుక. అది సరిగ్గా నేను మొన్నామధ్య వాడికి నామనసులో ఉన్న సీనరీని చెప్పి గీయమన్న బొమ్మ, చాలా శ్రద్దగా గీసి ఉంది. అది చూడగానే నా మనసు పొంగి పోయిందనుకోండి. తన ఇష్టాఇష్టాలకు కొడుకు విలువ ఇవ్వడం కన్నా మించింది ఏముంటుంది ఏ తండ్రి కైనా.
మర్చిపోకుండా మీరు కూడా మీనాన్న గారికి ఈ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేయండి. ఎక్కడో ఇండియాలో ఉన్న ఆ ముసలాయనికి ఫాదర్స్ డే అంటే ఏమర్ధమవుతుందీ అనుకుంటున్నారేమో, అదే అవకాశంగా తీసుకొని ఇంకో పది నిమిషాలు ఎక్కువ మాట్లాడితే, ఆయనకన్నా సంతోషించే వారుండరు.
"ఒరే, ఈరోజు పాదర్ డే అంట, పొద్దున్నే మావోడు పోన్ జేసి చెప్పేడు. అమెరికాలో ఇట్టా సవచ్చరానికో పాలి వాళ్ళ నాన్నల రోజు అని చేసుకుంటారంట, తెలుసా?" అని ఆయన అందరికీ చెప్పి సంతోషపడతారు.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బాగుందండి
సంతోషం.
పుత్రోత్సాహము తండ్రికి ...
మీకు అటువంటి పుత్రోత్సాహము కలగాలని ఆశిస్తూ
చాలా బాగుంది. నాకూ మా అమ్మాయి పెన్నొకటి ప్రెసెంట్ చేసిదండోయ్.
బొల్లోజు బాబా
బాగా చెప్పారు. తల్లిదండ్రుల మీద ప్రేమాగౌరవాలు చూపించడానికి ప్రత్యేకంగా ఒక రోజు అవసరం కాకపోయినా, కనీసం ఆ సాకుతో వారితో కాస్త quality time గడపడానికి పనికొస్తే అంతకన్నా ఎంకావాలి!
www.parnashaala.blogspot.com
@క్రాంతి గారు: కృతఙ్ఞతలు
@కొత్తపాళీ గారు: మీకు నా ధన్యవాదాలు.
@బొల్లోజుబాబా గారు: కృతఙ్ఞతలు. మీ రచనా వ్యాసంగం గురించి మీ అమ్మాయికి బాగానే అర్థమైనట్టుంది. మీకు అదే సరైన బహుమతి.
@మహేష్ గారు: చాలా చక్కగా చెప్పారు. నా ధన్యవాదాలు.
Post a Comment