UNICEF వారి లెక్కల ప్రకారం, అమెరికాలో మనం ప్రొద్దున్నే లేచి, రెడీ అయ్యి, ఆఫీసు చేరే సరికి ఒక్కొక్కరం సుమారుగా 100 గేలన్ల నీటిని వాడుతామంట. మీకు తెలుసా, ప్రపంచంలో చాలా మంది రోజు మొత్తానికి కేవలం 2 గేలన్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని? ఇంకా వివరాలకు, ఈ లింకు చూడండి. (ఇదే విషయం ఎప్పుడూ స్నానం ఎలా ఎగ్గొడదామా అని చూసే పిల్లలికి చెపితే, "మేము ఇకనుండి వారానికి ఒక్కసారే స్నానం చేస్తామని" అంటారేమో, జాగ్రత్త, సుమా!).
నీరు పొదుపు చెయ్యడానికి కొన్ని సలహాలు:
- నీరు పొదుపు చెయ్యడానికి స్నానం మానెయ్యమని కాదు. వీలయినంత తక్కువ నీరు వాడి, త్వరగా (5 నిమిషాలలోపు) స్నానం ముగించాలి. ఇంకో 10 నిమిషాలు ఎక్కువసేపు తోమినంత మాత్రాన మీ వళ్ళు ఏమీ ఎక్కువ తళతళలాడదని గుర్తుంచుకొండి. ఇక్కడ "ఎలుక తోక తెచ్చి యేడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు" అనే వేమన గారి పద్యం ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
- సబ్బుతో వళ్ళు తొముకొనేటప్పుడు, షవర్ కట్టేస్తే బోల్డన్ని నీళ్ళు పొదుపు చేసినట్లే. ఎన్ని నీళ్ళు పొదుపు అవుతాయి అనేది, మీ ఆకారం రమణా రెడ్డిలా ఉంటుందా, లేక సూరేకాంతం లా ఉంటుందా అనే దాని మీద ఆధార పడుతుందనుకోండీ.
- అలాగే పళ్ళు తోముకుంటున్నంతసేపూ & గడ్డం చేసుకుంటున్నంత సేపూ కుళాయి ఆన్ చేసి ఉంచడం మరికొంత మందికి అలవాటు. ఆ అలవాటుకూడా మార్చుకోవడం చాలా అవసరం.
- మా ప్రక్కింటివాడు ప్రతీ రోజూ సాయంత్రం 4 గంటలకి లాన్ స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తాడు. ఆ సమయానికి భూమి చాలావేడిగా ఉండడం వల్ల, చాలా నీరు గడ్డివేళ్ళకి చేరక ముందే ఆవిరి అయిపోతుంటుంది. అలా కాకుండా, స్ప్రింక్లర్స్ ఏ తెల్లవారుజామునో ఆన్ అయ్యేలా ప్రోగ్రాం చేసుకుంటే, నీరు ఆవిరై పోకుండా ఉండడమే కాకుండా, గడ్డికీ నీళ్ళు బాగా అందుతాయి. అంతేకాక రోజూ నీరు పెట్టాల్సిన అవసరం లేకుండా వారానికి రెండు మూడు సార్లు పెడితే సరి పోతుంది.
- గిన్నెలు తోముతున్ననంతసేపూ, కుళాయిని కట్టి ఉంచి, వాటిని కడిగేటప్పుడు మాత్రమే ఆన్ చెయ్యడం కూడా మంచి అలవాటే.
- నాలుగైదు గిన్నెలే ఉన్నప్పుడు, డిష్‌వాషర్ వాడకుండా, మీరే తోముకుంటే నీళ్ళూ ఆదా అవుతాయి, శారీరకశ్రమవల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ, ముఖ్యంగా మగవారికి, ఓ గమనిక: ఈ విషయం మీ భార్యకు మీరే స్వయంగా చెపితే, మీ తల బొప్పికట్టడమే కాకుండా, ఇకనుండి జిమ్ముకి బదులుగా మీరే గిన్నెలు కడగవలసి రావొచ్చు కూడా. జాగ్రత్త!
- అలాగే మాసిన బట్టలు ఇష్టం వచ్చినప్పుడు కాకుండా, ఒక ఫుల్ లోడ్ కు సరిపడా అయ్యేంతవరకూ ఆగి, వాషింగ్ మెషీన్ ని వాడాలి.
- మీ ఇంట్లో కుళాయిలు, కమోడ్, షవర్ మొదలైనవి ఏవైనా లీక్ అవుతున్నాయేమో చూసుకొని వెంటనే బాగు చేసుకోవాలి. కారేది ఒకో చుక్కే అయినా, రోజు మొత్తంలో చాలానే అవుతుంది.
ఇలాగే ఇంటా బయటా నీళ్ళు ఎలా పొదుపు చెయ్యొచ్చో తెలియజెయ్యడానికి మా డేల్లస్ వారి వెబ్ సైటు చూడండి http://www.savedallaswater.com/htcw.htm
No comments:
Post a Comment